: ఈ పదవి సైడ్ జాబే!... ఆర్బీఐ గవర్నర్ గిరీపై రాజన్ సంచలన వ్యాఖ్యలు!
భారతీయ రిజర్వ్ బ్యాంకు... దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక సంస్థ. ఈ సంస్థకు అధిపతి అంటే... భారత దేశ ఆర్థిక వ్యవస్థకు పథ నిర్దేశకుడే. ఇంతటి కీలక పదవిపై ఆర్బీఐ గవర్నర్ గా ప్రస్తుతం కొనసాగుతున్న రఘురామ రాజన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ పదవి తనకు కేవలం సైడ్ జాబేనని ఆయన పేర్కొని అందరికీ షాకిచ్చారు. ఇటీవల తనపై జరిగిన రాజకీయ దాడిపై నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాజన్ ఈ ఘాటు వ్యాఖ్య చేశారు. ‘‘పదే పదే చెబుతున్నా. నేను ప్రాథమికంగా విద్యావేత్తను. ఇది (ఆర్బీఐ గవర్నర్ పదవి) నాకు సైడ్ జాబ్ మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా తన పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లి తాను గతంలో అధ్యాపకుడిగా పనిచేసిన విశ్వవిద్యాలయంలోనే చేరుతానని, విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.