: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఎయిరిండియా పైలట్.. రూ.15 లక్షల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిరిండియా పైలట్ ఒకరు అడ్డంగా దొరికిపోయాడు. బుధవారం జెడ్డా నుంచి వచ్చిన విమానం ముంబైలో ల్యాండైంది. ఆ విమాన పైలట్ బ్యాగేజీలో కస్టమ్స్ అధికారులు రూ.15 లక్షల విలువైన బంగారం కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది బ్యాగ్‌లోకి ఎలా వచ్చిందో తనకు తెలియదని పైలట్ పేర్కొన్నాడు. తాను గత 20 ఏళ్లుగా ఎయిరిండియాలో పనిచేస్తున్నానని, తన నెల జీతం రూ.5.5 లక్షలని పేర్కొన్నాడు. స్కానింగ్‌లో పైలట్ బ్యాగేజీలో ఏదో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో దానిపై ఇంటూ మార్క్ వేసిన అధికారి తోటి అధికారులను అప్రమత్తం చేశాడు. స్కానింగ్ అనంతరం తన బ్యాగును తీసుకున్న పైలట్ దానిపైనున్న ఇంటూ మార్కును కర్చిఫ్‌తో చెరిపివేశాడు. దీనిని గుర్తించిన అధికారులు అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, డ్రైప్రూట్స్ ప్యాకెట్‌లో ఉన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయి. జెడ్డాలో ఓ వ్యక్తి తనకు ఈ డ్రైప్రూట్స్ ప్యాకెట్ ఇచ్చి ముంబైలోని తన బంధువులకు ఇవ్వమని కోరడంతో తీసుకున్నాను తప్ప తనకు మరేం తెలియదని పైలట్ పేర్కొన్నాడు. అయితే అతను చెప్పేదంతా కట్టుకథ అని, అతని ఫోన్ తమ వద్దే ఉంచామని అయితే ఆ ప్యాకెట్ తీసుకోవడానికి అతడి ఫోన్‌కు ఇప్పటి వరకు ఎటువంటి కాల్ రాలేదని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.