: 10,000 గదులు, 70 రెస్టారెంట్లు, 4 హెలీప్యాడ్లు... మక్కాలో అతి పెద్ద హోటల్ నిర్మాణం!
అది ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్! ఏకంగా 10,000 గదులు, 70 రెస్టారెంట్లు, నాలుగు హెలీప్యాడ్లు... ఇందులో వున్నాయి. ఈ విశేషమైన హోటల్ ను సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ 3.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ముస్లింలకు అతి పవిత్రమైన మక్కా నగరంలో నిర్మించనుంది. మక్కా నగరాన్ని పవిత్రంగా భావించడంతో కోట్ల మంది ముస్లింలు ప్రతిఏటా అక్కడికి క్యూకడతారు. దీంతో వారికి సౌకర్యాల కల్పన అన్నది సౌదీ ప్రభుత్వానికి శక్తికి మించిన పనిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా అతి పెద్ద భవన నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం పూనుకుంది. దీంతో ప్రతిఏటా మక్కాను దర్శించుకునేందుకు వచ్చే పర్యటకుల కోసం "అబ్రజ్ కుడయ్" పేరిట ఈ భారీ హోటల్ ను నిర్మిస్తున్నారు. ఈ హోటల్ 12 టవర్లతో, కోటి యాభైలక్షల చదరపుటడుగుల్లో విస్తరించి ఉంటుంది. 45 అంతస్తుల ఈ భవనంలో దాదాపు 10,000 గదులు, 70 రెస్టారెంట్లు, నాలుగు హెలీప్యాడ్లతో రాజసౌధాన్ని తలపిస్తుంది. రికార్డుల పరంగా చూస్తే... ప్రపంచంలో అత్యధిక గదులు ఉన్న హోటల్ ఇదే అవుతుంది. అతిపెద్ద టవర్లకు అతిపెద్ద పైకప్పు విషయంలో కూడా రికార్డు ఈ హోటల్ దే అవుతుంది. ఈ భవనంలో ఐదు అంతస్తులు కేవలం సౌదీ రాజకుటుంబానికి మాత్రమే రిజర్వు అయి ఉంటాయి. 12 టవర్లలో రెండు టవర్లలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించనుండగా, మిగిలిన 10 టవర్లలో ఫోర్ స్టార్ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ హోటల్ ఇంటీరియర్ డిజైన్ బాధ్యతలను లండన్ కు చెందిన యారిన్ హాస్పిటాలిటీ సంస్థకి అప్పగించారు. 2017 నాటికి దీనిని అందుబాటులోకి తేవాలని సౌదీ భావిస్తున్నప్పటికీ...ఆర్థిక పరిస్థితుల కారణంగా మరో సంవత్సరం ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ హోటల్ అందుబాటులో వచ్చే వరకు మలేషియాలోని 7,351 గదులతో నిర్మించిన ఫస్ట్ వరల్డ్ హోటల్ ప్రపంచంలో అతిపెద్ద హోటల్ గా రికార్డు పుటల్లో నిలిచింది.