: నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్నవి ఇవే!


మావోయిస్టుల సమాచారం ఇస్తానని పోలీసులను బుట్టలో వేసుకున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ అసలు గుట్టును పోలీసులు విప్పుతున్నారు. నయీమ్ ఇంట్లోని బెడ్ రూంలో దొరికిన డైరీలో 35 పేజీల్లో పలువురు పోలీసు అధికారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా కోడ్ భాషలో మరి కొంత మందికి సంబంధించిన పేర్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అలాగే పోలీసులను అడ్డం పెట్టుకుని ఛత్తీస్ గఢ్, ఒడిశా, గోవాలలో భారీ ఎత్తున ఆస్తులు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్ గఢ్ పోలీస్ అధికారులు నయీమ్ కు ఏకే47 సమకూర్చినట్టు భావిస్తున్నారు. గోవాలో నయీమ్ జల్సాలు చేసిన విలాసవంతమైన నివాసాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ నివాసంలో వాచ్ మెన్ ను అదుపులోకి తీసుకుని, ఆ ఇంటి డాక్యుమెంట్లు, లక్షల రూపాయల నగదును అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని కొండాపూర్‌ లో అత్యంత విలువైన స్థలాల డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. హఫీజ్‌ పేట్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కొండాపూర్ సర్వే నెంబర్ 86, 87లో ఏకంగా 69 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎకరం ధర 20 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. సర్వే నెంబర్ 86, 87, 88లో ఇప్పటికే లే అవుట్‌ లు వేయడాన్ని వారు గుర్తించారు. కేవలం కొండాపూర్ లో ఉన్న ఈ మొత్తం ఆస్తి విలువ వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. మరి కొన్ని చోట్ల నయీమ్ ఇంట్లో దొరికిన పత్రాల్లో ఉన్న ఎకరాల కొద్దీ భూములు కబ్జాలో ఉన్నట్టు వారు గుర్తించారు. వారంతా తమ స్థలాలతో నయీమ్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో నయీమ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లో ఎస్సై స్ధాయి నుంచి వివిధ స్థాయులకు చెందిన పలువురు అధికారులను నయీమ్ తన గుప్పిట్లో ఉంచుకున్నాడని అతని డైరీలు చెబుతున్నాయి. అలాగే నయీం ఎవరినైనా టార్గెట్ చేస్తే...వారి వద్దకు అమ్మాయిలను సరఫరా చేసి, లొంగదీసుకున్నట్టు ఆధారాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. నార్సింగిలోని నయీమ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను రెండు పెద్ద బ్యాగుల నిండా పోలీసులు తీసుకెళ్లారంటే వాటిల్లో ఎంత కీలకమైన సమాచారం ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా అతని నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో మరింత కీలక సమాచారం చేజిక్కుతుందని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News