: ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా కారు ఢీకొని ఒకరి మృతి
కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కేరళలో జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఢిల్లీ నుంచి కొచ్చి వచ్చిన సింథియా కారులో చేర్తలకు వెళ్తున్నారు. కొచ్చి-అలప్పుజ హైవేపై పుతియకవు వద్ద ఆయన కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో, ద్విచక్రవాహనం నడుపుతున్న ఆ వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పుతియకవు ప్రాంతానికి చెందిన శశిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ విషయాన్ని సింథియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై అలప్పుజ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, కారులో సింథియాతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.