: నయీమ్ ఇంటితో పాటు, అనుచరుల ఇళ్లలో కూడా 'సిట్' సోదాలు
నార్సింగిలోని నయీమ్ ఇంట్లో ఈరోజు సాయంత్రం సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి స్వయంగా సోదాలు చేపట్టారు. నయీమ్ బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అదేవిధంగా రాజేంద్రనగర్ మండలం లోని అల్కాపురి టౌన్ షిప్ లో నయీమ్ ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం. కాగా, వనస్థలిపురం ద్వారకామాయినగర్ లో నయీమ్ అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని పోలీసులు ఈరోజు గుర్తించారు. ఖయ్యూమ్ ఇంట్లో కూడా పలు కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే ఇంట్లో మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ కూడా ఉంటున్నారు. అయితే, నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. వీళ్లిద్దరూ రిటైర్డ్ ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే, మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నయీమ్ అనుచరులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.