: బ్యాటింగ్ సగటులో గవాస్కర్ ను మించిపోయిన అశ్విన్!
బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎక్కడ? స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడ? మరి, గవాస్కర్ బ్యాటింగ్ సగటును అశ్విన్ దాటేయడమేంటన్న అనుమానం వచ్చిందా? నిజమే, వెస్టిండీస్ గడ్డపై గవాస్కర్ బ్యాటింగ్ సగటును అశ్విన్ మించిపోయాడు. దీంతో మరో ఘనతను అశ్విన్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. విండీస్ సిరీస్ లో ఇంతవరకు విజయవంతమైన ఆటగాడెవరంటే నిస్సందేహంగా రవిచంద్రన్ అశ్విన్ పేరు చెప్పవచ్చు. విండీస్ పై కనీసం ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో ఇప్పటివరకూ 65.45 సగటుతో 48 ఇన్నింగ్స్ లలో 13 సెంచరీలు చేసిన దిగ్గజం సునీల్ గవాస్కర్ మొత్తం 2749 పరుగులు చేసి, భారత్ తరపును అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుపుటలకెక్కాడు. తాజాగా అశ్విన్ కేవలం 9 ఇన్నింగ్స్ లలో 66.57 బ్యాటింగ్ సగటుతో, మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాయంతో మొత్తం 466 పరుగులు చేశాడు. దీంతో విండీస్ గడ్డపై మెరుగైన సగటు కలిగిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అలాగే విండీస్ గడ్డపై టెస్టు సిరీస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడంతో పాటు, కనీసం రెండు ఇన్నింగ్స్ లలో 50కి పైగా పరుగులు చేసిన మూడో టీమిండియా ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. గతంలో ఈ ఘనతను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.