: పరుగెత్తుకెళ్లి విమానం ఎక్కేశాడు...!
భారత్ లోని బస్టాండుల్లో నిత్యం కనిపించే దృశ్యం మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో దర్శనమివ్వడంతో దానిని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... మాడ్రిడ్ నుంచి గ్రాన్ కెనారియా వెళ్లాల్సిన ఓ వ్యక్తి ఆగస్టు 5న ర్యాన్ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నాడు. భారత్ లో ట్రైన్ లా విమానాలు కూడా ఆలస్యంగా వస్తాయని భావించాడో ఏమో కానీ, మాడ్రిడ్ ఎయిర్ పోర్టుకు అతను ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో బోర్డింగ్ సమయం దాటిపోయింది. ప్రయాణికులంతా విమానంలో కూర్చున్నారు. దీంతో విమానం టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, దానిని మిస్ కాకూడదనుకున్నాడు. దీంతో ఎయిర్ పోర్టులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి రన్ వే వైపు దూకి విమానాన్ని వెంబడించాడు. అలా పరిగెడుతూనే విమానం ఎక్కేశాడు. అతను అలా పరుగెడుతుండగా గుర్తించిన అధికారులు కెనారియా విమానాశ్రయాధికారులను హెచ్చరించారు. దీంతో విమానం కెనారియాలో అడుగుపెట్టగానే విమానాన్ని చుట్టుముట్టిన పోలీసులు, అతనిని అరెస్టు చేసి, విచారించారు. అతనికి ఎలాంటి ఉగ్రవాద సంబంధాలు లేవని తేలడంతో విడుదల చేశారు. అయితే విమానాశ్రయ సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగా, ఇది వైరల్ అయింది.