: సాయిథరమ్ తేజ్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు: ‘తిక్క’ కథ, స్క్రీన్ ప్లే రచయిత షేక్ దావూద్
యువ హీరో సాయి ధరమ్ తేజ్ తనను ఎంతో ఎంకరేజ్ చేశారని ‘తిక్క’ కథ, స్క్రీన్ ప్లే రచయిత షేక్ దావూద్ అన్నారు. సాయిధరమ్ తేజ్ సరసన లారిస్సా బోనేసి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి షేక్ దావూద్ మాట్లాడుతూ, తిక్క సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కొత్తదనంతో పాటు డిఫరెంట్ గా ఉన్న ఈ కథని అర్థం చేసుకుని, ఒప్పుకుని, తనను ఎంకరేజ్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్, ప్రొడ్యూసర్ రోహిణి రెడ్డి, దర్శకుడు సునీల్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలిపారు. తన గత సినిమాల లానే ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు. తాను చెన్నైలో పుట్టి పెరిగానని, సినిమాలపై ఉన్న మమకారంతో ఆస్ట్రేలియాలో ఫిలిం డిప్లొమా కోర్సు కూడా చేశానని చెప్పారు. ఆ తర్వాత సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకుని 50కి పైగా యాడ్ ఫిలిమ్స్ తీసినట్లు చెప్పారు. అయితే, సినిమాలకు స్క్రీన్ ప్లే చేయాలనే ఆలోచనలో ఉన్న తనను దర్శకుడు కృష్ణవంశీ పిలిచి, తాను రూపొందించిన ‘మొగుడు’ చిత్రానికి అవకాశమిచ్చారన్నారు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా షేక్ దావూద్ ప్రస్తావించారు.