: మోదీని గెలిపించినా న్యాయం జరగడం లేదు: గాలి ముద్దుకృష్ణమనాయుడు
ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన హామీలు, హోదాపై ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని అన్నారు. కేవీపీ పెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుని కేంద్రం ఆర్థిక బిల్లంటూ దాటవేసే ప్రయత్నం చేస్తోందని, అది సరికాదని ఆయన అన్నారు. ఏపీకి హోదా సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తమపార్టీ ఎంపీలు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తారని నరేంద్రమోదీని నమ్మామని, ఆయనను గెలిపించినా ఏపీకి న్యాయం జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.