: లొంగిపోయిన మావోయిస్టు పోలీసయ్యాడు.. లొంగిపోయిన మరో మావోయిస్టుని వివాహమాడాడు!
మావోయిస్టు ఉద్యమం నుంచి జనజీవనంలోకి అడుగుపెట్టి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు మన్సాయ్ అనే వ్యక్తి. మరోవైపు సుక్మా జిల్లా బెంగ్పాల్ గ్రామానికి చెందిన మావోయిస్టు పద్మిని కూడా ఇటీవలే తుపాకీని వదిలి పోలీసులకి లొంగిపోయింది. వీరిరువురూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించారు. వీరిద్దరూ గతంలో మావోయిస్టుగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమయ్యారు. తాజాగా వీరిరువురి వివాహం అధికారులు, పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగింది. ఇటీవలే పోలీసులకి లొంగిపోయిన వారిలో పద్మినితో పాటు భద్రమ్, లచ్‌మతి అనే మరో జంట కూడా ఉన్నారు. మన్సాయ్, పద్మిని వివాహంతో పాటు భద్రమ్, లచ్‌మతి వివాహం కూడా పోలీసుల సమక్షంలో జరిగింది. వీరి వివాహాలను గ్రామస్తులంతా సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగానే ఉంటాయి. వారిని జనజీవనంలో కలపడానికి పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. తమ ముందు లొంగిపోయిన మావోయిస్టులకు పెళ్లిళ్లు జరిపిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.