: అక్క, అన్నయ్య మార్గంలోనే వెళుతున్న చిన్నారి.. నాలుగేళ్ల వయసులోనే తొమ్మిదో తరగతి!
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన వయసు. ఇల్లు, అమ్మ, ఇంట్లోని వారే లోకంగా బతకాల్సిన చిన్నారి. తనను నర్సరీలో చేర్పించడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేయాల్సిన సమయం. కానీ ఆ నాలుగేళ్ల చిన్నారి అప్పుడే తొమ్మిదో తరగతి చదివేస్తోంది. నర్సరీలో కాకుండా నేరుగా తొమ్మిదో తరగతిలో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిన్నారి అద్భుతమైన మేధస్సుకు అందరూ సలాం అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అనన్య అనే నాలుగేళ్ల పాప ఈ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అనన్య అక్క 15 ఏళ్ల సుష్మ ఇప్పటికే మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం సుష్మ మైక్రోబయాలజీలో డాక్టరేట్ చేస్తోంది. మరోవైపు అనన్య అన్నయ్య శైలేంద్ర తొమ్మిదేళ్ల వయసులో టెన్త్ పూర్తి చేశాడు. అక్క, అన్నయ్య దారిలోనే నడుస్తూ వారికన్నా అత్యద్భుతంగా మేధస్సును కనబరుస్తోంది అనన్య. లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న తేజ్ బహదూర్ వర్మ అనే వ్యక్తి ఈ చిన్నారుల తండ్రి. వర్మ ఓరోజు అనన్యను తనతో కలిసి మార్కెట్‌కు తీసుకెళ్లారు. అనన్య అక్క, అన్నయ్య చదువుకున్న సెయింట్ మీరా కళాశాల అధ్యాపకురాలు అప్పుడు ఆయనను కలిశారు. ఈ సమయంలో అనన్య ఓ పుస్తకం తీసుకొని దాన్ని చదువుతుండడాన్ని ఆమె కనిపెట్టారు. అనన్యను ఆమె తీసుకెళ్లి పరీక్ష పెట్టారు. ఆశ్చర్యం కలిగించే ప్రతిభను కనబరిచి తొమ్మిదో తరగతిలో చేరడానికి అనన్య అర్హత సాధించింది. ఆ తర్వాత అనన్య తొమ్మిదో తరగతిలో చేరిపోయింది. చిన్నారి అనన్య తన సోదరి, సోదరులు సుష్మ, శైలేంద్ర కంటే మెరుగైన ప్రతిభ కనబరుస్తోందని స్కూల్ మేనేజర్ వినోద్ రత్రా తెలిపారు. అనన్యకు ఉచితంగా చదువు చెప్పిస్తామని పేర్కొన్నారు. అనన్య సోదరి సుష్మ సైతం ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడే తొమ్మిదో తరగతిలో చేరిందని ఆయన చెప్పారు. ఆ చిన్నారుల తండ్రి తేజ్ బహదూర్ వర్మ మాట్లాడుతూ.. తమ పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్‌లు ఏమీ పెట్టించలేదని అన్నారు. ఎంతో త్వరగా నేర్చుకుంటూ తమ పిల్లలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. చిన్నారి అనన్య ఎల్లప్పుడు పుస్తకం చేతిలో పట్టుకునే కనబడుతుందని పేర్కొన్నారు. అనన్య ఇప్పటికే రామాయణం కూడా చదివేసిందని చెప్పారు. ఇదంతా తమకి దేవుడిచ్చిన వరంగా ఆయన అభివర్ణించారు.