: ఆశ్రమంలో నీళ్లు తాగినందుకు దళిత కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లపై దాడి
ఓ ఆశ్రమంలోని చేతిపంపు వద్ద దాహం తీర్చుకున్న కారణంగా దళిత కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లపై దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగింది. గో సంరక్షకులు దళితులపై దాడులకు దిగుతున్న ఘటనలపై ఓవైపు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా, మరోవైపు నీళ్లు తాగినందుకు దళితులపై దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని గున్నోర్ ప్రాంతంలోని దుండా ఆశ్రమం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఆశ్రమం ముందున్న చేతిపంపు వద్ద తన దాహాన్ని తీర్చుకునేందుకు స్థానికంగా కూలి పనిచేసుకునే 13 ఏళ్ల బాలిక వెళ్లింది. దీనిని గమనించిన ఆశ్రమంలోని వ్యక్తులు ఆ బాలికపై దాడి చేశారు. బాలిక తండ్రి తన కూతురిపై జరిగిన దాడిని అడగడానికి వెళ్లాడు. ఆయనను కూడా ఆశ్రమంలోని వారు చితక్కొట్టారు. ప్రస్తుతం తండ్రీకూతుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.