: కశ్మీర్ పరిస్థితులపై భావోద్వేగంతో ప్రసంగించిన గులాం నబీ ఆజాద్
జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈరోజు రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. చర్చను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ అందంగా ఉంటుందని మాత్రమే దానిపై ప్రేమ చూపకండి అని వ్యాఖ్యానించారు. అక్కడ నివసిస్తూ ఆందోళనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కూడా ప్రేమించండి అంటూ భావోద్వేగంతో అన్నారు. కశ్మీర్ వాసులను మిగతా భారతీయుల్లాగే చూడాలని ఆయన అన్నారు. ఆందోళనకు చెలరేగిన 32 రోజుల తర్వాతైనా ఈ అంశంపై రాజ్యసభలో చర్చకు గ్రీన్ సిగ్నల్ తెలిపినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గులాం నబీ ఆజాద్ తెలిపారు. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమనే అంశం సత్యమే అన్న ఆయన.. కశ్మీరీలతో మనం కలిసిపోయామా? అనే అంశాన్ని ఒకసారి గమనించాలని పేర్కొన్నారు. కశ్మీరులో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఉగ్రవాద చర్యలను చవిచూసిందని, అక్కడి వాతావరణం చాలా సున్నితంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతుండడంతో కశ్మీరీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. వారి సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహించాయని ఆయన అన్నారు. ఇప్పుడైనా వారికి సంఘీభావం తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అక్కడికి అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడేలోపే మనం ఆ పని చేయాలని, అప్పుడు వారికి భరోసా ఇచ్చినట్లు అవుతుందని ఆయన సూచించారు. ప్రధాని మోదీ కశ్మీర్, దళితులపై దాడులు అంశాల్లో పార్లమెంటులో స్పందించకుండా బయట ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడడమేంటని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో ప్రధాని దళితులపై స్పందించారని, ఆయన చెప్పిన మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ చేసిన ప్రకటనే పార్లమెంటులో చేస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.