: ఐరాస ప్రధాన కార్యాలయంలో సంగీత కచేరీ చేయబోతున్న ఏఆర్ రెహ్మాన్
ఆస్కార్ విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యాలయంలో సంగీత కచేరీ చేయనున్నారు. భారత్ 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈనెల 15న ఆయన సంగీత కచేరి చేస్తారు. 50 ఏళ్ల క్రితం ఇటువంటి గౌరవమే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మికి దక్కిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఆమె తరువాత మళ్లీ ఆ గౌరవాన్ని పొందుతున్న వ్యక్తిగా ఏఆర్ రెహ్మాన్ నిలిచారు. ఇప్పటికే ఆస్కార్, గ్రామీ, బాఫ్టా వంటి అంతర్జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్న ఏఆర్ రెహ్మాన్ ఐరాసలో కచేరి చేసి మరింత పేరు సంపాదించనున్నారు.