: కలకలం రేపుతున్న నయీమ్ డైరీ!... రాజకీయనేతలు, ఐపీఎస్ లు, జర్నలిస్టుల పేర్లు!


తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు చెందిన ఓ డైరీ పోలీసుల చేతికి చిక్కింది. ఈ డైరీ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోగానే... మొన్న రాత్రే హైదరాబాదులోని అలకాపురిలోని అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ లెక్కకు మిక్కిలి నోట్ల కట్టలు, మారణాయుధాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో నయీమ్ తనకు పరిచయం ఉన్న వారి పేర్లను రాసుకున్నాడు. ఈ పేర్లలో 15 మంది దాకా సీనియన్ ఐపీఎస్ అధికారులున్నట్లు వెలువడ్డ వార్తలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ డైరీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని నయీమ్ సొంతూరు భువనగిరికి చెందిన ఎంపీపీ వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నయీమ్ డైరీలో ఉన్న రాజకీయ నేతల పేర్ల విషయానికి వస్తే... జాబితాలో తెలుగు నేలకు చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లున్నట్లు సమాచారం. రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో పాటు నయీమ్ దోస్తుల జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారట. డైరీలోని పేర్లను ఒక్కటొక్కటిగా పరిశీలిస్తున్న పోలీసులు... నయీమ్ తో వారు నెరపిన వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News