: నయీమ్ ఆస్తులు రూ.4 వేల కోట్ల పైమాటే!... అలకాపురి ఇంటిలో కీలక పత్రాలు స్వాధీనం!

తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కూడబెట్టిన ఆస్తుల చిట్టా చూస్తుంటే పోలీసులకే దిమ్మ తిరుగుతోందట. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిన అతడు భారీ నేర సామ్రాజ్యాన్నే స్థాపించాడు. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో మొన్న జరిగిన ఎన్ కౌంటర్ లో అతడు చనిపోయిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు నయీమ్ కు చెందిన అన్ని స్థావరాల్లో ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని అలకాపురిలోని అతడి ఇంటిలోనే రూ.2 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయట. ఇక నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను అతడు కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ నయీమ్ కు చెందిన నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పోలీసులు మరోమారు అలకాపురి ఇంటిలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో నయీమ్ కు చెందిన మరిన్ని కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. ఇప్పటిదాకా పోలీసులకు చిక్కిన నయీమ్ ఆస్తుల విలువ ఎంతలేదన్నా... రూ.4 వేల కోట్లకు పైమాటేనని తెలుస్తోంది.