: ఇక నాలుగేళ్లు నిండిన పిల్లలు కూడా హెల్మెట్ ధరించాల్సిందే.. లేదంటే రూ.వెయ్యి జరిమానా
మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ముందు ఉంచింది. ఇక నుంచి నాలుగేళ్లు నిండిన పిల్లలు కూడా విధిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందంటూ బిల్లులో ప్రతిపాదన తీసుకొచ్చింది. అతిక్రమించినవారి నుంచి రూ.వెయ్యి జరిమానాగా వసూలు చేయనున్నట్టు పేర్కొంది. అయితే తలపాగా ధరించే సిక్కు పిల్లలకు మాత్రం ఇది వర్తించదని వివరించింది. కార్లలో ప్రయాణించే 14 ఏళ్ల లోపు పిల్లలు రక్షణ కోసం తప్పకుండా సీటు బెల్టు ధరించాల్సిందేనని ప్రతిపాదించింది. చాలామంది ద్విచక్ర వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకుందుకే హెల్మెట్ ధరిస్తున్నారు తప్ప రక్షణ గురించి కాదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు భద్రతే ధ్యేయంగా సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం ద్వారా రోడ్ సేఫ్టీని పెంచాలని నిర్ణయించింది. అలాగే కమర్షియల్ డైవర్లకు లైసెన్స్ జారీ చేసే విషయంలో కనీస అర్హత నిబంధన విధించనుంది. బిల్లును త్వరితగతిన చట్టంగా మార్చడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా రోజుకు 400 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. సవరణ బిల్లు ప్రకారం తాగి వాహనం నడిపే వారికి రూ.15 వేలు, ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా, ఏడాది జైలు లేదంటే రెండూ విధించనున్నారు. ఇన్స్యూరెన్స్ లేకుండా రెండోసారి పట్టుబడిన వారికి రూ.4 వేలు ఫైన్ వేయనున్నారు. అలాగే డ్రైవింగ్ చేస్తూ పిల్లలు పట్టుబడితే ఆ వాహన రిజిస్ట్రేషన్‌ను రెండేళ్లపాటు రద్దు చేస్తారు. అంతేకాదు అటువంటి వారికి 25 ఏళ్ల లోపు లైసెన్స్ మంజూరు చేయరు. వాహన యజమానికి కూడా జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.