: 'ఒకే ఒక్కడి' కోసం రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఐబీ, ఏటీస్ పోలీసులు.. ఢాకా ఎటాక్ సూత్రధారి కోసం ముమ్మర గాలింపు
ఇప్పుడు ఒకే ఒక్కడి కోసం అటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) తీవ్రంగా గాలిస్తున్నాయి. ఆ ఒకే ఒక్కడు మరెవరో కాదు.. ఢాకా ఉగ్రదాడి సూత్రధారి, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు బంగ్లాదేశ్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న అబు ఇబ్రహిం అల్-హనీఫ్ అలియాస్ తమీమ్ చౌధురి(35). ఢాకా పేలుళ్లకు ముందు అతడు భారత్‌కు పారిపోయి ఉంటాడని బంగ్లాదేశ్ నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అతడి కోసం అణువణువు క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు తమీమ్ ఫొటోలను పశ్చిమబెంగాల్, అసోం సహా బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాల పోలీస్ స్టేషన్‌లకు పంపి అప్రమత్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి తమకు అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందని, తమీమ్ ఇక్కడే ఉంటే కనుక అతడు తప్పించుకుపోలేడని కౌంటర్ టెర్రరిజం సీనియర్ అధికారి తెలిపారు. స్వాతంత్ర్య సంబరాలకు దేశం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతకుముందే తమీమ్‌ను పట్టుకోవాలని ఎన్ఐఏ అధికారులు గట్టి పట్టుదలతో ఉన్నారు.