: ఆల్ రౌండర్ గా అశ్విన్!... మూడో టెస్టులో బ్యాట్ తో రాణించిన స్పిన్నర్!
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిజంగా ఆల్ రౌండరే. వెస్టిండిస్ టూర్ లో బౌలింగ్ తోనే కాకుండా బ్యాటుతోనూ సత్తా చాటుతున్న అశ్విన్ తన కెరీర్ లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. తాజాగా నిన్న ప్రారంభమైన మూడో టెస్టులో టాపార్డర్ వరుసగా పెవిలియన్ చేరినా, అశ్విన్ (75 నాటౌట్) మాత్రం నిలబడి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అశ్విన్, వృద్ధిమాన్ సాహా (46) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు వెస్టిండిస్... పర్యాటక జట్టు టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు మెరవడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా... మూడో టెస్టులో మాత్రం విండీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడింది. ఫలితంగా 87 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ జట్టును ఆదుకున్నాడు. రెహానేతో కలిసి విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన అశ్విన్.. రెహానే ఔటైన తర్వాత సాహాతో కలిసి జట్టు స్కోరును పరుగు పెట్టించాడు. వెరసి తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోరును 234 పరుగులకు చేర్చాడు.