: ఆర్బీఐకి తరలిస్తున్న నగదు దోపిడీకి కుట్ర... రైలు బోగీకి వెల్డింగ్ మిషన్ ద్వారా రంధ్రం చేసిన దుండగులు
తమిళనాడులోని సేలం నుంచి చెన్నై రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి రైలులో తరలిస్తున్న నగదు చోరీకి దుండగులు యత్నించారు. మొత్తం 226 క్యాష్ బాక్సులను రిజర్వ్ బ్యాంకు అధికారులు సేలం నుంచి తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాష్ బాక్సులు ఉంచిన బోగీలకు వెల్డింగ్ మిషన్ ద్వారా పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి దుండగులు ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైలోని విల్లుపురం జిల్లాలో ఉన్న విరుడాచలం జంక్షన్ వద్ద ఈ రైలుకి ఇంజన్ ను మార్చారు. ఈ సమయంలో పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ దోపిడీ విషయం బయట పడింది. రెండు క్యాష్ బాక్సుల మూతలు తెరిచి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, నగదు దోపిడీ ఎంత జరిగింది? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం రూ.324 కోట్లు ఆ బాక్సులలో ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం తెలియగానే రైల్వే ఐజీ రామచంద్రన్, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. విచారణకు ఆదేశించారు. వేలిముద్రల నిపుణులను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, విరుడాచలం జంక్షన్ నుంచి ఎలక్ట్రిక్ లైన్ లేకపోవడంతో ఈ మార్గ మధ్యంలో ఈ చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కదులుతున్న రైలుపైకి ఎక్కి దుండగులు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.