: ఆస్తుల విషయంలో ముంబై మాఫియాను మించిపోయిన నయీమ్... విస్తుపోతున్న అధికారులు
గ్యాంగ్ స్టర్ నయీమ్ విషయంలో తవ్వుతున్న కొద్దీ వెలుగుచూస్తున్న ఆస్తుల చిట్టా పోలీసులు, రెవెన్యూ అధికారులను విస్తుపోయేలా చేస్తోంది. కట్టల కొద్దీ డబ్బులు, అంతకుమించిన విలువైన భూముల పత్రాలు, కిలోల కొద్దీ బంగారు, వజ్రాల నగలు పట్టుబడటంతో, వీటి విలువ మదింపు ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదని అధికారులు అంటున్నారు. నయీమ్ మరిన్ని ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చని, వాటన్నింటినీ వెలుగులోకి తీసుకువచ్చేందుకు విచారణను మరింత ముమ్మరం చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ పట్టుబడిన మొత్తం విలువ ముంబై మాఫియా ఆస్తులను మించిపోయిందని అధికారులు చెబుతున్నారు. కొండాపూర్ లో వెలుగు చూసిన 69 ఎకరాల విలువ రూ. 1000 కోట్ల వరకూ ఉంటుందని, పుప్పాలగూడ, మణికొండల్లోని 40 ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ప్లాట్ల వాల్యూ మరో రూ. 1000 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భువనగిరి సమీపంలోని 500 ఎకరాలు, హైదరాబాద్ లోని పదులకొద్దీ ప్లాట్ల విలువను లెక్కించాల్సి వుందని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో సైతం పెద్ద సంఖ్యలో స్థలాలను కూడబెట్టిన నయీమ్ వద్ద ఖరీదైన ఆడీ కారుతో పాటు హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లున్నాయని తెలిపారు.