: క‌ల్లోల క‌శ్మీర్‌పై పెద‌వి విప్పిన ప్రధాని మోదీ


క‌శ్మీర్‌ కల్లోలంపై గత కొన్నాళ్లుగా మౌనం పాటించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈరోజు పెద‌వివిప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ యువతను కొంతమంది కావాల‌నే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పుస్త‌కాలు, ల్యాప్ టాప్‌లు, క్రికెట్ బ్యాట్లు ప‌ట్టాల్సిన వారి చేతుల‌కు రాళ్లు ఇస్తూ వారిని కొంద‌రు హింస‌కు పురిగొల్పుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కొంత‌మంది కార‌ణంగా ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొంద‌ని అన్నారు. క‌శ్మీర్ వాసుల‌కు ఉపాధి కల్పించ‌డంలో కేంద్రం సాయం అందిస్తుంద‌ని మోదీ తెలిపారు. ప్ర‌తి భార‌తీయుడు క‌శ్మీర్‌ను ప్రేమిస్తున్నాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ఆ రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పారు. అంతా సంయ‌మ‌నం పాటించాల‌ని పిలుపునిచ్చారు. క‌శ్మీర్ ప్ర‌భుత్వంతో పాటు కేంద్రం క‌శ్మీరు వాసుల అభివృద్థికి కృషి చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌ల్లోలం సృష్టించ‌డానికి ఎవ్వ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ప్ర‌భుత్వం వారి ప్ర‌య‌త్నాల‌ను తిప్పి కొడుతూ క‌శ్మీర్‌లో మామూలు ప‌రిస్థితులు తీసుకురావ‌డానికే ప్ర‌యత్నిస్తోంద‌ని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్ లో ఘర్షణలు చెలరేగడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News