: యూపీ నుంచి బ్రాహ్మణులను తరిమేస్తా... మీరంతా గుజరాత్ కు పోండి!: ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్రాహ్మణులను తరిమేస్తానంటూ సమాజ్ వాది పార్టీ నేత రాజీవ్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజ్నూరు జిల్లాకు చెందిన ఆయన ఒక ప్రభుత్వాధికారితో ఘర్ణణ పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అంటే యాదవులు, ముస్లింల గడ్డ అని,ఇక్కడ బ్రాహ్మణులు ఉంటానికి వీల్లేదంటూ ఆ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని బ్రాహ్మణులంతా ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు తరలి పోవాలంటూ ఒక ప్రభుత్వాధికారికి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. జమ్మూకాశ్మీర్ నుంచి కాశ్మీరీ పండిట్లను తరిమివేసినట్లు, యూపీ నుంచి బ్రాహ్మణులను తాము తరిమికొడతామని, బ్రాహ్మణులు లంచగొండులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, యూపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజీవ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఎస్పీ నేతలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.