: పాతబస్తీలో 221 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలో నిన్న అర్ధరాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై హల్చల్ చేస్తున్న యువతే లక్ష్యంగా వారు 'ఆపరేషన్ చబుత్రా' పేరుతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 221 మంది యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. యువత అందరూ అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ హల్‌చల్ చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. యువకులను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని ఈరోజు వారి తల్లిదండ్రులకు చేరవేశామని పేర్కొన్నారు. 221 మంది యువకులకు, వారి తల్లిదండ్రులకు పురానీ హవేలిలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని, మరోసారి తమకు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించనున్నారు.