: ఈ-కామర్స్ పరంగా అతిపెద్ద డీల్ తో అమెజాన్ కు సవాల్ విసిరిన వాల్-మార్ట్
ప్రపంచ ఈ-కామర్స్ చరిత్రలో అతిపెద్ద డీల్ కుదిరింది. ఈ రంగంలో అత్యధిక టర్నోవర్ ను కలిగివున్న అమెజాన్ కు గట్టి పోటీని ఇచ్చేందుకు నిర్ణయించుకున్న వాల్-మార్ట్, 'జెట్ డాట్ కామ్'ను 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22 వేల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ మొత్తం జెట్ ఆదాయంతో పోలిస్తే ఆరింతలు అధికం. జెట్ డాట్ కామ్ తో డీల్ గురించి సంస్థ స్వయంగా తెలిపింది. సంప్రదాయ రీటెయిల్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న వాల్-మార్ట్, ఆన్ లైన్ వ్యాపారం పుంజుకున్న తరువాత మార్కెట్ లీడర్ అమెజాన్ నుంచి పోటీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 15 స్టార్టప్ ఈ-కామర్స్ కంపెనీలను కొనుగోలు చేసిన వాల్-మార్ట్ మరిన్ని విలీనాలకు పావులు కదుపుతోంది. ఈ డీల్ తరువాత వాల్-మార్ట్ ఆన్ లైన్ వ్యాపారం మరింతగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2015 జూలైలో ప్రారంభమైన జెట్ డాట్ కామ్, పలు రకాల ఆఫర్లు, తగ్గింపు ధరలను అందిస్తూ, తక్కువ కాలంలో పాప్యులర్ అయింది. వర్చ్యువల్ షాపింగ్ కార్టును పరిచయం చేస్తూ, వెచ్చించిన మొత్తంతో పోలిస్తే, అధిక ప్రొడక్టులను ఇచ్చే సంప్రదాయాన్ని మొదలు పెట్టి విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం వాల్-మార్ట్ కోటికి పైగా ప్రొడక్టులను ఆన్ లైన్ లో విక్రయిస్తుండగా, అమెజాన్ 2 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.