: రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ నయీమ్... ఒక్క కొండాపూర్ లోనే 69 ఎకరాలు!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తన అనుచరులు, బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని పోలీసులు తమ విచారణలో తేల్చారు. వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది భూ పత్రాలను పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించగా, వాటిని పరిశీలించిన అనంతరం నార్సింగి, కొండాపూర్, నల్గొండ, భువనగిరి, పుప్పాలగూడ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో నయీమ్ స్థలాలను కూడబెట్టినట్టు వెల్లడించారు. ఒక్క కొండాపూర్ లోనే 69 ఎకరాల్లో నయీమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు గుర్తించారు. భువనగిరి మండలం బొమ్మాయి పల్లిలో తన బినామీల పేరిట వందల ఎకరాల భూములను ప్రజల నుంచి బెదిరించి సొంతం చేసుకున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ స్థలాలన్నీ తొలుత ఎవరి పేరున ఉన్నాయి? ఎప్పుడు ఎవరు ఎవరికి రిజిస్టర్ చేశారన్న విషయమై కూపీ లాగుతున్నాయి. మరోవైపు నయీమ్ తమ భూములను లాక్కున్నారని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో, పోలీసులు వాటిపైనా దృష్టిని సారించారు.