: ఎంత వర్షం పడింది? ఎంత నీరు చేరింది?: అధికారులను ప్రశ్నించిన కేసీఆర్
ప్రస్తుత సీజన్ లో కురిసిన వర్షపాతం, ఆపై ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల్లో చేరిన నీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అయిన ఆయన, ఆయకట్టుకు ఎంత నీటిని విడుదల చేయవచ్చని అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాజెక్టులో ఏ మేరకు నీరుందన్న వివరాలు అడిగిన ఆయన, ఎస్సారెస్పీ లో 47.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెప్పడంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండినందున మహబూబ్ నగర్ అవసరాలు తీర్చేంత నీటిని విడుదల చేయాలని చెప్పారు. గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులూ జలకళతో ఉన్నాయని, ఈ సంవత్సరం సాధ్యమైనంత ఎక్కువ పంట పొలాలకు నీరివ్వాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.