: సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీ రాకూడదనే భావించా: మోదీ


గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, వస్తు సేవల పన్ను బిల్లుపై తనకెన్నో అనుమానాలు ఉండేవని, ఓ దశలో ఆ బిల్లుతో నష్టమేనని భావించానని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ప్రధానిగా వచ్చి తనకున్న అనుమానాలు మరెవరికీ రాకుండా, ఆ సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేశానని, అందువల్లే విపక్షాలు కూడా సహకరించి, దేశ పన్ను విధానంలో అత్యంత ముఖ్యమైన సంస్కరణలకు మార్గం సుగమమైందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై గుజరాత్ సీఎంగా ఉన్న తనకు ఎన్నో అనుమానాలు రాగా, అప్పటి కేంద్ర మంత్రి, ఇప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పలుమార్లు చర్చించానని అన్నారు. సీఎంగా ఉన్న వేళ వద్దని భావించిన ఈ బిల్లును, ప్రధాని అయిన తరువాత మరింత ప్రజామోదం పొందేలా తీర్చిదిద్దాలని భావించానని తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లుపై పూర్తి అవగాహన ఉందని, ఏ అనుమానమున్నా తాను తీర్చగలనని అన్నారు. బిల్లుపై రాష్ట్రాల ప్రభుత్వాలకు నమ్మకం పెరగాల్సి వుందని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News