: భర్త పెట్రోల్ పోసి తగలబెట్టిన వేళ, బిడ్డలను కాపాడి ప్రాణాలు వదిలిన తల్లి
ఇల్లు గడిచేందుకు డబ్బులు ఎవరివ్వాలంటూ ఓ జంట మధ్య జరిగిన వాదన తారస్థాయికి చేరి, భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన వేళ, తన బిడ్డలను కాపాడుకున్న ఆ కన్నతల్లి సజీవ దహనమైంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నై సమీపంలో జయపాల్, ప్రేమ తమ ఇద్దరు బిడ్డలతో కలసి కారులో వెళుతున్న వేళ, వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో జయపాల్ పట్టరాని కోపంతో కారులో ఉన్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించి కిందకు దూకి పారిపోయాడు. దాంతో వెనక సీట్లో ఉన్న తన ఇద్దరు కుమారులూ తగలబడిపోతారని తల్లడిల్లిన తల్లి, తన ఒంటిపై చెలరేగుతున్న మంటలను భరిస్తూనే, అద్దాలు పగులగొట్టి, వారిని బయటకు నెట్టింది. భార్యను సజీవంగా దహనం చేసిన జయపాల్, ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆంబులెన్స్ ను పిలిచి, సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లాడు. అప్పటికీ ప్రాణాలతోనే ఉన్న ఆమె, తన మరణ వాంగ్మూలంలోనూ భర్త పేరును చెప్పలేదని తెలుస్తోంది. పోలీసులు రంగ ప్రవేశం చేసిన తరువాత విచారణలో అసలు విషయం వెల్లడైంది. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.