: వెళ్తూ వెళ్తూ మురిపించని రఘురాం రాజన్... తగ్గని వడ్డీ రేట్లు!


వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్ తన చివరి పరపతి సమీక్షలో ఎలాంటి విధాన పరమైన మార్పులనూ ప్రకటించలేదు. కీలకమైన రెపో రేటును స్థిరంగానే ఉంచుతున్నట్టు కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఐదేళ్ల కనిష్ఠ స్థాయిలో 6.5 శాతం వద్ద రెపో రేటు ఉన్నదని వెల్లడించిన ఆయన, తదుపరి ద్రవ్యోల్బణం గమనం, ఆహార ఉత్పత్తుల ధరల సమీక్ష తరువాతనే వడ్డీ రేట్ల సవరణ అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. వాస్తవానికి తన చివరి సమీక్షలో ఎలాంటి నిర్ణయాలనూ ఆయన తీసుకోకపోవచ్చని, తదుపరి వచ్చే గవర్నర్ కు నిర్ణయాధికారాన్ని ఇస్తూ, పరపతి రేట్లు యథాతథంగానే ఉంచుతారని ఆర్థిక విశ్లేషకులు ముందే ఊహించారు. ఈ మూడేళ్ల పదవీ కాలంలో భవిష్యత్ జీడీపీపైనే తాను దృష్టిని సారించానని, వృద్ధి రేటు స్థిరపడేందుకు కృషి చేశానని పరపతి సమీక్ష అనంతరం రాజన్ వ్యాఖ్యానించారు. రెండంకెల వృద్ధి రేటును భారత్ చేరుకునేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ కలసి పనిచేయాల్సి వుందని అభిప్రాయపడ్డారు. కాగా, సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్, ఆపై అమెరికాకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలన్న ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల నాడు ఆల్ టైం రికార్డు స్థాయికి రూపాయి మారకం విలువ పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, రూపాయి విలువ తిరిగి కోలుకోవడంలో తనవంతు పాత్రను పోషించారు. ఒకదశలో రెండోసారి ఆయనకు అవకాశం దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి కూడా. కానీ, మోదీ ప్రభుత్వం కొత్త గవర్నర్ ను ఎంచుకోవాలని నిర్ణయించుకోవడంతో, రాజన్ పదవీ విరమణ ఖాయమైంది.

  • Loading...

More Telugu News