: ఏపీలో నడుస్తున్నది కాపుల కాలమే!... పవన్ కల్యాణ్ తోనే టీడీపీకి అధికారం!: వీహెచ్ కీలక వ్యాఖ్య!
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు... ఏపీ రాజకీయాలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన అక్కడే ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో కాపుల హవా కొనసాగుతోందని, రాష్ట్రంలో నడుస్తున్నది కాపుల కాలమేనని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జట్టుకట్టి బరిలోకి దిగినా... జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ కారణంగానే ఆ కూటమి విజయం సాధించిందని వీహెచ్ చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే... భవిష్యత్తులో కాపులే నాయకత్వం వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటిదాకా రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వారు పాలన సాగిస్తే... భవిష్యత్తు మాత్రం కాపులదేనని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజల వాదన ఇదేనన్న ఆయన తన వాదన కూడా అదేనని చెప్పుకొచ్చారు.