: వివాదాస్పద దీవిలో చైనా మిలటరీ నిర్మాణాలు.. ధ్రువీకరిస్తున్న శాటిలైట్ ఫొటోలు
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలను, అభ్యంతరాలను పక్కనపెట్టిన చైనా తన పంథాలోనే ముందుకు సాగుతోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవిలో ఆర్మీని మోహరించేందుకు కావాల్సిన నిర్మాణాలు చేపడుతోంది. రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లను నిర్మిస్తున్నట్టు తాజాగా బయటపడిన ఉపగ్రహ ఫొటోలు ధ్రువీకరిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే శాటిలైట్ ఫొటోల్లో మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లేదని తెలిపింది. జూలై చివర్లో ఉపగ్రహం ఈ ఫొటోలు తీసినట్టు వివరించింది. వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్) ఈ ఫొటోలను విశ్లేషిస్తున్నట్టు పత్రిక పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై సర్వహక్కులు తమవేనని వాదిస్తున్న డ్రాగన్ కంట్రీ.. స్పార్టీ ఐలండ్లోని ఫీరీ క్రాస్, సుబి, మిస్చిఫ్ రీఫ్ ప్రాంతాల్లో చైనా హ్యాంగర్ నిర్మిస్తోంది. తద్వారా ప్రతీ ఏడాది 5 ట్రలియన్ బిలియన్ల వ్యాపారం చేయాలనేది చైనా వ్యూహం. కాగా దక్షిణ చైనా సముద్రంపై హక్కుల విషయంలో చైనా వాదనను అంతర్జాతీయ ట్రైబ్యునల్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. అక్కడ మిలటరీ కోసం ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని అమెరికా సహా పలు దేశాలు చైనాను కోరాయి. అటువంటిదేమీ జరగబోదని పలుమార్లు పేర్కొన్న చైనా ఇప్పుడు నిర్మాణాలు చేపడుతుండడంపై పలు దేశాలు మండిపడుతున్నాయి.