: ‘స్మార్ట్ పల్స్ సర్వే’లో పందుల ప్రశ్న... గ్రామ కార్యదర్శిని బంధించిన ‘అనంత’ వాసులు!
మీరు విన్నది నిజమే. ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్మార్ట్ పల్స్ సర్వే’ ప్రశ్నావళిలోని ఓ ప్రశ్న... అనంతపురం జిల్లాలోని ఓ గ్రామ కార్యదర్శిని నిర్బంధానికి గురి చేసింది. నిన్న జిల్లాలోని ఓబుళదేవర చెరువు మండలం టి.కుంట్లపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అటు ప్రభుత్వంతో పాటు ఇటు సర్వేలో పాలుపంచుకుంటున్న అధికారులను విస్మయానికి గురి చేసింది. టి.కుంట్లపల్లికి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న మల్లికార్జున సర్వే విధుల్లో భాగంగా గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబం వద్దకు వెళ్లారు. సర్వే ప్రశ్నావళిలోని 20వ ప్రశ్నలోని 3-బీ కాలమ్ ప్రకారం ‘మీ ఇంటిలో పందులు ఉన్నాయా?’ అని ఆ ఇంటిలోని హసీనా అనే మహిళను ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా ఆగ్రహావేశానికి గురైన హసీనా... మల్లికార్జునపై విరుచుకుపడ్దారు. హసీనా స్వరం పెంచడంతో మిగిలిన మహిళలు కూడా ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగని వారు మల్లికార్జునపై దాడి చేసి పంచాయతీ కార్యాలయం వద్దకు ఆయనను తీసుకెళ్లి అందులో ఆయనను నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఎంపీీపీ, తహశీల్దార్, ఎంపీడీఓ... హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి ఏమాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని తెలుసుకుని మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ లో సమాచారాన్ని చేరవేశారు. వెంటనే స్పందించిన మంత్రి హసీనాతో ఫోన్ లో మాట్లాడారు. మల్లికార్జునను అక్కడి నుంచి బదిలీ చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో హసీనా తదితరులు శాంతించారు. అసలు విషయమేంటంటే... ముస్లింలకు పంది అంటే పరమ అసహ్యం. ఈ క్రమంలో దీనిని అంతగా పట్టించుకోని మల్లికార్జున సర్వే ప్రశ్నావళిలోని సదరు ప్రశ్నను వారికి సంధించి ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు... సర్వేలో ఇలాంటి ప్రశ్నల కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నారు.