: నయీమ్ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్!... భువనగిరి ఎంపీపీ, జడ్పీటీసీల ఇళ్లల్లో సోదాలు, అరెస్టుల పర్వం!


తెలంగాణ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నిన్న చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. నయీమ్ ఎన్ కౌంటర్ ముగిసిన వెంటనే తెలంగాణ పోలీసు బాసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో హైదరాబాదు నగరంతో పాటు మహబూబ్ నగర్, నయీమ్ సొంత జిల్లా నల్లగొండలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు, స్థిరాస్తి పత్రాలు, ఆయుధాలు బయటపడ్డాయి. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే... నయీమ్ సొంతూరు భువనగిరికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై పోలీసులు దృష్టి సారించారు. భువనగిరి ఎంపీపీ వెంకటేశ్ తో పాటు జడ్పీటీసీ ఇంటిలోనూ సోదాలు చేసిన పోలీసులు అక్కడ కూడా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...నయీమ్ తో జడ్పీటీసీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకటేశ్ అరెస్ట్ తో నయీమ్ కు రాజకీయ నేతలతోనూ సంబంధాలపై పోలీసులు కాస్తంత లోతుగానే ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News