: 11న ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మనున్న నింగి!
ఈనెల 11న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవనుంది. నింగి దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసుకుంటుందా అనుకునేలా వెలుగులు విరజిమ్మనుంది. తారాజువ్వల్లా ఉల్కలు నేలరాలనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని, దీంతో భారీ వెలుగులు కనపడతాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 200 వరకు ఉల్కలు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని నాసా పేర్కొంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని తెలిపింది. ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో దుమ్ము, ధూళి కణాలను ఢీకొట్టడం వల్ల అవి మండిపోతాయని, తద్వారా భారీ వెలుగు వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.