: మా ఆలోచన, నిద్ర, ఆహారం... అన్నీ ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నాయి: టీడీపీ ఎంపీ రవీంద్రబాబు
మా ఆలోచన, నిద్ర, ఆహారం, సంతోషం, బాధ అన్నీ ఏపీకి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నాయని అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. జీఎస్టీ సవరణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. హోదా హామీ నెరవేరకుండా జీఎస్ టీ సవరణ బిల్లుపై చర్చల్లో పాల్గొంటే ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయమై వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. ‘ఒక దేశం- ఒక పన్ను విధానం తీసుకొచ్చినందుకు ప్రధాని, ఆర్థిక మంత్రి, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలందరికీ అభినందనలు. భారత్ ఎప్పుడూ ఒకటే అని నిరూపించారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి వచ్చాక ప్రత్యేకహోదా అంశంపై పార్లమెంట్ లో మొదటిసారి మాట్లాడే అవకాశం వచ్చింది. మాకు ప్రత్యేక హోదా కావాలి. జీఎస్ టీ బిల్లుకు మేము మద్దతు ఇచ్చాం. మీరూ, మేము అడిగింది ఇవ్వండి. మేము ఎప్పటికీ క్రమశిక్షణ గల సైనికుల్లాంటి వాళ్లమే. ప్రత్యేక హోదా అనేది చాలా భావోద్వేగంతో కూడిన అంశం. జీఎస్ టీ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి వెళితే ప్రత్యేకహోదా ఇవ్వకుండా మీరెందుకు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారన్న ప్రశ్నలు ఎదురవుతాయి. దీనికి దయచేసి సమాధానం చెప్పండి. ప్రత్యేకహోదాపై ఈ వారంలో మీ నుంచి సమాధానం ఆశిస్తున్నాం. మీరు ఇప్పటికే హామీ ఇచ్చారు. జీఎస్ టీ అమల్లోకి వస్తే మా రాష్ట్రం రూ.6800 కోట్లు నష్టపోతుంది’ అంటూ రవీంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.