: మోసాలకు పాల్పడుతున్న 'గొడుగు' స్వామి అరెస్టు... రిమాండ్
వజ్రాలు వెలికితీస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నిరంజన్ రెడ్డి అలియాస్ గొడుగుస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గొడుగుస్వామి వజ్రాలు వెలికి తీస్తానంటూ పలువురి నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పాటు ఒక టీవీ ఛానెల్ లో ఈ వార్త ప్రసారం కావడంతో ఈ విషయంపై పోలీసులు దృష్టి పెట్టడంతో సదరు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.70 వేలు, పూజా సామగ్రి, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ ఆదేశించారు.