: సీఎంగా చేసిన అనుభవం నాకిప్పుడు కలిసొస్తోంది, జీఎస్టీ అంటే గ్రేట్ స్టెప్ బై టీమిండియా: లోక్‌సభలో మోదీ
‘ఒకే దేశం ఒకే పన్ను’ విధానం భారత్‌కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు చర్చలో భాగంగా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇకపై ట్యాక్స్ టెర్రరిజం నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి అందరి కృషి అవసరమని అన్నారు. జీఎస్టీతో పారదర్శకత దిశగా గొప్ప ముందడుగు పడుతుందని పేర్కొన్నారు. బిల్లుకి మద్దతిస్తున్న పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మోదీ అన్నారు. జీఎస్టీ సవరణ బిల్లు ఏ ఒక్క పార్టీ విజయం కాదని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల పన్ను ఎగవేతను అరికట్టేలా చేయొచ్చని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించిన బాధ్యతల అనుభవం తనకిప్పుడు కలిసొస్తోందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను ఆనాటి అనుభవంతోనే తాను ఎదుర్కోగలుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ బిల్లు అమలు చేసుకునే క్రమంలో ముఖ్యమంత్రుల సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసని మోదీ అన్నారు. బిల్లుపై అన్ని సమస్యలను అధిగమించినట్లు తెలిపారు. జీఎస్టీ చిన్న ఉత్పాదనే అయినా కచ్చితమైన రక్షణ లభిస్తుందని మోదీ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య విశ్వాసం ఉండాలని ఆయన కోరారు. జీఎస్టీ బిల్లు సానుకూలంగా అమలుదిశగా ముందుకు వెళుతుండడం ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. ఇక అభివృద్ధిలో దూసుకుపోదామని పిలుపునిచ్చారు.