: నీ కుటుంబం బాగుండాలంటే డబ్బులివ్వమని నయీం ఫోన్ లో బెదిరించాడు: స్థిరాస్తి వ్యాపారి గంగాధర్


కోటి రూపాయలివ్వాలని తనను బెదిరిస్తూ గత నెలలో నయీం అనుచరులు తనకు ఫోన్ కాల్ చేశారని స్థిరాస్తి వ్యాపారి గంగాధర్ చెప్పారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఫోన్ చేసింది నయీం అనుచరులని తెలుసుకుని భయపడ్డానన్నారు. నయీం హతమైనా, అతని ముఠా నిజామాబాద్ లో ఉండవచ్చన్నారు. ‘గత నెల 15వ తేదీన డిచ్ పల్లిలోని నా ఫాంహౌస్ లో డిన్నర్ కు కూర్చునే సమయంలో ఒక అనామక వ్యక్తి ఫోన్ చేశాడు. ‘నీ భార్య జెడ్పీటసీ కూరపాటి అరుణేనా!’ అని అడిగాడు. ‘అవునండి’ అని చెప్పాను. ‘సరే, మరి, యాంటీ నక్సలైట్ టీమ్ నుంచి మాట్లాడుతున్నాము... మాకు నిధులు కావాలి’ అన్నాడు. ఏం నిధులు కావాలయ్యా, నా దగ్గరేమి నిధులుంటాయని చెప్పాను. నేనేదో సామాజిక సేవ పేరిట గరీబోళ్లకు బట్టలిస్తుంటాను.. నీకు నిధులిచ్చేంత పెద్దోడిని కాదు నేనని చెప్పాను. ‘పిల్లగాళ్ల తీరుగా మాట్లాడకు. సీరియస్ మ్యాటర్ ఇది. నీ భార్య జెడ్పీటీసీ... నువ్వు బాగుండాలంటే మాకు కంపల్సరీ నిధులివ్వాలి’ అని ఆ అతడు డిమాండ్ చేశాడు. ఇప్పుడేమీ కాదు, రేపు పొద్దున్న మాట్లాడమని అతనితో చెప్పాను. అతను మళ్లీ 16వ తారీఖు నాడు 11.00 నుంచి 11.30 గంటల మధ్య ఫోన్ చేశాడు. మళ్లీ అదే నంబరుండటం చూశాను. ‘ఎవరు మీరు?’ అని నేను ప్రశ్నిస్తే...‘పేరు చెప్పనయ్యా.. నేను చెప్పాను కదా డబ్బులు సమకూర్చాలి’ అని ఆ వ్యక్తి అన్నాడు. నా దగ్గర డబ్బుల్లేవని, నేనే బాకీల్లో ఉన్నానని చెప్పాను. ‘అలాంటి కథలు చెప్పొద్దు, నీకు 50..60 ఎకరాల పొలం ఉన్నది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. నీ భార్య జెడ్పీటీసీ. నీ కుమారుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. నీ చిన్న కుమారుడు జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యాలా, లేకుంటే మీ కుటుంబంలో ఎవరో ఒకళ్లను కిడ్నాప్ చేసి తీవ్ర నష్టం చేస్తాం, ప్రాణాలు కూడా తీస్తాము. ఒక ఫిగర్ చెప్పు.. అది, మా భయ్యాకు చెబుతాను నేను.. భయ్యా నా పక్కకే ఉన్నాడు ఇదిగో మాట్లాడు’ అని ఫోన్ చేసిన వ్యక్తి అనడంతో.. నేను ఎవరితోనూ మాట్లాడనని చెప్పాను. బ్లాక్ మనీ ఉన్నావాడినడుగు, నన్ను అడుగు తావేంటని అతనితో అన్నాను. ‘నాలుగు గంటలకు ఏదోఒక విషయం చెప్పకపోతే ఒక ప్రాణం తీసేస్తామని’ వార్నింగ్ ఇచ్చాడు. మళ్లీ ఒక గంట తర్వాత ఒక మెస్సేజ్ పంపాడు. అందులో ఒక కోటి రూపాయలు పంపమని బెదిరించాడు’ అని గంగాధర్ పేర్కొన్నారు. ఈ మెస్సేజ్ చూసి భయం పుట్టడంతో పోలీసులను ఆశ్రయించానని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News