: నిజామాబాద్ వ్యాపారి ఫిర్యాదుతో వలపన్నిన పోలీసులు... దొరికిపోయిన నయీమ్!
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్ ఆచూకీ కోసం నెలల తరబడి గాలిస్తున్నా గ్రేహౌండ్స్ పోలీసులకు చిన్న క్లూ కూడా లభించలేదు. అయితే బెదిరించి డబ్బు వసూలు చేసే నయీమ్ లక్షణమే అతడిని గ్రేహౌండ్స్ బలగాలకు అడ్డంగా పట్టిచ్చింది. ఈ మేరకు నేటి ఉదయం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన నయీమ్ ఎన్ కౌంటర్ కు సంబంధించిన కీలక సమాచారం వెలుగుచూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... బెదిరింపులతో కోట్లాది రూపాయలను వసూలు చేసిన నయీమ్ తన దందాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన నయీమ్ రూ. కోటీ తెచ్చివ్వాలని హుకుం జారీ చేశాడు. షాద్ నగర్ కు తాను చేరుకునే సమయంలో డబ్బుతో అక్కడ సిద్ధంగా ఉండాలని కూడా సదరు వ్యాపారిని నయీమ్ బెదిరించాడు. ఈ క్రమంలో బెంబేలెత్తిపోయిన వ్యాపారి నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యాపారి ఫిర్యాదు నేపథ్యంలో జిల్లాలోని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యంది. నయీమ్ చెప్పిన సమయం ఆసన్నమవడంతో గట్టి నిఘా పెట్టిన పోలీసులు... ఎట్టకేలకు అతడిని ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టేశారు.