: నయీమ్ ఎన్ కౌంటరయ్యాడు!... ధ్రువీకరించిన టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి!
తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్ పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. నయీమ్ తలదాచుకున్న భవనంపై తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో నయీమ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో నయీమ్ ఒక్కడే చనిపోయాడా? లేక అతడితో పాటు అతడి అనుచరులెవరైనా మరణించారా? అన్న విషయాలు తేలలేదు. ఈ ఎన్ కౌంటర్ పై టీఆర్ఎస్ సీనియర్ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన... షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోయాడని పేర్కొన్నారు. షాద్ నగర్ లో రేగిన కలకలం ఉగ్రవాదులదిగా భావించినా... అక్కడ తలదాచుకున్నది నయీమ్ అని తేలిందని, పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.