: తెలుగు టీవీ ఛానెళ్లలో వైరల్ గా నయీమ్ ఎన్ కౌంటర్ దృశ్యాలు!
పాలమూరు జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం చోటుచేసుకున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ కు సంబంధించిన దృశ్యాలు తెలుగు న్యూస్ టీవీ ఛానెళ్లలో వైరల్ గా మారాయి. షాద్ నగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు నుంచి మొదలైన పోలీసుల కదలికలన్నీ మీడియా కెమెరాలకు చిక్కాయి. పెట్రోల్ బంకు నుంచే పోజిషన్ తీసుకున్న పోలీసులు... చాలా జాగ్రత్తగా ముందుకు కదిలారు. అత్యాధునిక మెషీన్ గన్లను చేతబట్టుకుని రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ పంపు వద్ద కూడా వాటిని చేతుల్లో పట్టుకునే కనిపించారు. ఇక నయీమ్ బస చేసిన భవనం వద్ద యాక్షన్ లోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న రోడ్ డివైడర్లు, చెట్లను రక్షణగా చేసుకుని అటాకింగ్ మొదలుపెట్టారు. యువ ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి నేరుగా కార్యరంగంలోకి దిగి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. నయీమ్ గన్ మన్ కాల్పులతో మరింత అప్రమత్తమైన పోలీసులు... చాకచక్యంగా భవనాన్ని చేరుకుని కాల్పులు జరిపారు. మెషిన్ గన్లు చేతబట్టుకున్న పోలీసులు, చెట్లు, డివైడర్లు, గోడలను రక్షణగా చేసుకుని ముందుకు కదిలిన దృశ్యాలు అచ్చం యుధ్ధ సన్నివేశాలను తలపిస్తున్నాయి.