: మహారాష్ట్రలో తప్పించుకుని షాద్ నగర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్!


పలు సంచలన కేసుల్లో ప్రధాన నిందితుడిగా పోలీసు రికార్డులకు ఎక్కిన గ్యాంగ్ స్టర్ నయీమ్... ఎట్టకేలకు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు పట్టుబడిపోయాడు. నేటి ఉదయం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో గ్రేహౌండ్స్ పోలీసుల తూటాలకు అతడు మరణించాడు. భూ దందాలు, సెటిల్ మెంట్లతో తెలంగాణ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన నయీమ్ పై చాలా కాలం క్రితమే పోలీసులు దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. నయీమ్ ను పట్టుకునేందుకు కొన్ని నెలల క్రితమే గ్రేహౌండ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవలే నయీమ్ మహారాష్ట్రలో ఉన్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు అక్కడికి కూడా తరలివెళ్లాయి. అయితే నయీమ్ వారికి చిక్కలేదు. దీంతో నిరాశగా తిరిగివచ్చిన గ్రేహౌండ్స్ బలగాలు పక్కా సమాచారం కోసం ఎదురుచూశాయి. ఈ క్రమంలో షాద్ నగర్ కు నయీమ్ వచ్చాడన్న పక్కా సమాచారం రావడంతో గ్రేహౌండ్స్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయాయి. గుట్టుచప్పుడు కాకుండా నయీమ్ తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. అయితే అప్పటికే పోలీసుల అలికిడి నయీమ్ చెవిన పడిపోయింది. దీంతో అతడి గన్ మన్ పోలీసులపైకి కాల్పులకు దిగాడు. నయీమ్ ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు అక్కడికి వెళ్లినప్పటికీ... అతడి గన్ మన్ కాల్పులకు దిగడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో నయీమ్ అక్కడికక్కడే చనిపోయాడు.

  • Loading...

More Telugu News