: నయీమ్ గన్ మన్ కాల్పులతోనే ఎదురు కాల్పులు!... డీజీపి అనురాగ్ శర్మ ప్రకటన!
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో నేటి ఉదయం జరిగిన నయీమ్ ఎన్ కౌంటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ నోరు విప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసిన అనురాగ్ శర్మ... అందులో ఎన్ కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు. నిన్న రాత్రి 7 గంటలకే నయీమ్ తన అనుచరులతో కలిసి షాద్ నగర్ చేరుకున్నాడని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నయీమ్ బసపై పక్కా సమాచారం సేకరించిన తర్వాతే గ్రేహౌండ్స్ బలగాలు అతడి ఇంటిని చుట్టుముట్టాయన్నారు. తానుంటున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని పసిగట్టిన నయీమ్ అప్రమత్తమయ్యాడని తెలిపారు. ఈ క్రమంలో నయీమ్ ఆదేశాలతో అతడి గన్ మన్ పోలీసుల పైకి కాల్పులు మొదలుపెట్టాడన్నారు. ఈ కాల్పుల నుంచి రక్షించుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు ఎదురు కాల్పులకు దిగాయని ఆయన తెలిపారు. ఈ కాల్పుల్లో నయీమ్ చనిపోయాడని డీజీపీ పేర్కొన్నారు.