: షాద్ నగర్ లో ఉన్నది ఉగ్రవాదులు కాదు... గ్యాంగ్ స్టర్ నయీమ్!... హతం చేసిన పోలీసులు!
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగస్టర్ నయీమ్ హతమయ్యాడు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం రేపిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లోనూ నయీమ్ కీలక నిందితుడు. భూదందాలు, సెటిల్ మెంట్లతో తనదైన శైలిలో కరుడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన నయీమ్ పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు అతడిని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు కొద్దిసేపటి క్రితం షాద్ నగర్ లో అతడిని అంతమొందించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీమ్ పై 100కు పైగా కేసులున్నాయి.