: ప్రాణాల మీదకు తెచ్చిన సాహసం.. పారా సైలింగ్ చేస్తూ వ్యాపారవేత్త దుర్మరణం
పారాసైలింగ్ చేస్తూ గాల్లో తేలిపోవాలని కోరుకున్న ఓ వ్యాపారవేత్త అది తీరకుండానే దుర్మరణం పాలయ్యాడు. గాల్లోకి ఎగిరిన నిమిషంలోపే ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. కోయంబత్తూరులోని కొడిస్సియా గ్రౌండ్స్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. లేటర్స్ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా శుక్రవారం నుంచి ఇక్కడ పారాసైలింగ్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఏరోస్పేస్ అండ్ స్పోర్ట్స్ క్లబ్, కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారాసైలింగ్‌లో పలువురు ఔత్సాహికులు పాల్గొంటున్నారు. పీలమేడుకు చెందిన మల్లేశ్వరరావు(53) అనే వ్యాపారవేత్త కుటుంబం హాలీడేను సెలబ్రేట్ చేసుకునేందుకు కొడిస్సియా వచ్చింది. మల్లేశ్వరరావు పారాసైలింగ్‌కు ముందుకొచ్చారు. అయితే గాల్లోకి ఎగిరి నిమిషం కూడా కాకుండానే 50 అడుగుల ఎత్తునుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. నిర్వహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన బెల్టుకున్న హుక్ విడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.