: రియో పారా ఒలింపిక్స్ లో కలకలం!... డోపింగ్ ఆరోపణలతో ఈవెంట్ నుంచి రష్యా ఔట్!
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియో ఒలింపిక్స్ లో రెండో రోజే సంచలన నిర్ణయం వెలువడింది. డోపింగ్ ఆరోపణలు రావడంతో రష్యాపై ఈ మెగా టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి జరిగే పారా ఒలింపిక్స్ (శారీరక వైకల్య క్రీడాకారులు పాలుపంచుకునే క్రీడలు) వేటు పడింది. ఫలితంగా రష్యా లేకుండానే పారా ఒలింపిక్స్ కొనసాగనుంది. సెప్టెంబర్ 18 దాకా జరగనున్న పారా ఒలింపిక్స్ లో రష్యా కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో పతకాలు సాధించడం ఖాయమే. అయితే డోపింగ్ ఆరోపణలు ఆ దేశానికి శాపంగా మారాయి. రష్యా క్రీడాకారుల్లో పలువురిపై జరిగిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఈ మెగా ఈవెంట్ నుంచి రష్యాను బహిష్కరించింది.