: జెండా పండగ ఘనంగా నిర్వహించండి... దానిలోని మూడు రంగులు కొత్త అర్థాలు చెప్పాలి: మోదీ పిలుపు


తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వీడ్కోలు తెలిపారు. అంతకు ముందు ఎల్బీస్టేడియంలో ప్రసంగించిన నరేంద్రమోదీ.. తెలంగాణ‌లో జెండా పండ‌గ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 17 వ‌ర‌కు తిరంగా యాత్ర‌లో పాల్గొనాల‌ని ఆయ‌న సూచించారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఈ యాత్రను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న భార‌త్‌కి స్వాతంత్ర్యం ల‌భించింద‌ని, కానీ హైదరాబాద్‌కు మాత్రం ఆ త‌రువాతి 13 నెలలకి సెప్టెంబరు 17న విముక్తి లభించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. జాతీయపతాకంలోని మూడు రంగుల స్ఫూర్తితో కొత్త మార్పులు అందుకోవాల‌ని కాషాయ విప్లవం అంటే సౌర విద్యుత్‌, శ్వేత విప్లవమంటే పాలదిగుబడి పెరగడం, పత్తి దిగుబడి పెంచడం, ఇక ఆకుపచ్చని రంగు రెండో హరిత విప్లవానికి నాంది కావాలని మోదీ సూచించారు. ఇలా జెండాలోని మూడు రంగులు కొత్త అర్థాలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశహితం కోసం భారతీయులు రాజీప‌డ‌బోర‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. లాల్‌బహుదూర్‌ శాస్త్రి ప్రధానిగా వున్న స‌మ‌యంలో ఆనాడు ఆ నేత ఇచ్చిన పిలుపు ప‌ట్ల ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌నను మోదీ గుర్తు చేస్తూ.. ఒక్కపూట ఆహారం మానేయమని లాల్‌బ‌హుదూర్ శాస్త్రి పిలుపునిస్తే కోట్లాదిమంది పాటించార‌ని అన్నారు. ఇప్పుడు తాను గ్యాస్‌ సబ్సిడీలను వదులుకోవాలని ఒక్క‌మాట చెబితే లక్షలాది మంది స‌బ్సిడీని వ‌దులుకున్నార‌ని ఆయ‌న అన్నారు. పేదలకు గ్యాస్ అందించేందుకు వారు తోడ్ప‌డ్డార‌ని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం ఐదు కోట్లమంది పేదలకు కొత్త‌గా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింద‌ని పేర్కొన్నారు. వ్యవసాయరంగం మ‌రింత అభివృద్ధి చెందాల‌ని, దానికి టెక్నాలజీ అనుసంధానం ద్వారా ఉత్పత్తి పెరగాలని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News