: దళితులపై ఇంకా దాడులు జరగడమంటే మానవత్వానికి మాయని మచ్చే: మోదీ
దళిత, పీడితులందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అస్పృశ్యత అనేది ఇంకా ఉండడం సిగ్గు చేటని, ఎంతో కాలంగా దళితులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దళితులపై ఇంకా దాడులు జరగడమంటే మానవత్వానికి మాయని మచ్చేనని పేర్కొన్నారు. ఈ ఆధునిక కాలంలో ఇంకా అంటరానితనం ఉందనేది బాధాకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దళితులందరికీ చేరాలని, అది నెరవేరితే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండబోవని మోదీ అన్నారు. బీజేపీ వైపు దళితులు రాకుండా ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దళితులపై రాజకీయం చేస్తే దేశానికి మంచిది కాదని అన్నారు. కేంద్రం చేపట్టిన పథకాలను దళితుల వద్దకు తీసుకెళ్లాలని ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంబయిలో అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రధాని పేర్కొన్నారు.